Osmania University |విజ్ఞానం ప్రపంచాన్ని శాసిస్తుంది
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్ణారెడ్డి వెల్లడి
ఓయూలో ఒక సదస్సులో పాల్గొన్న విద్యా మండలి ఛైర్మన్
Hyderabad : విజ్ఞాన విప్లవం ప్రపంచాన్ని శాసిస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. ఒక్కో శతాబ్దానికి ఒక్కో ప్రత్యేకత ఉందని ఆయన అన్నారు. ప్రస్తుత 21వ శతాబ్దం ఆధునిక, సాంకేతిక విజ్ఞాన అభివృద్ధికి కేంద్రంగా నిలిచిందని తెలిపారు. ఈ మేరకు సోమవారం "ఆధునిక మేధో విజ్ఞానం - భారతీయ జ్ఞాన వ్యవస్థల మూలాలు, పునరుద్ధరణ” అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ జి. రాంరెడ్డి దూరవిద్యా కేంద్ర ఆడిటోరియంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల జాతీయ సదస్సుకు ఆయన మఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత అనే పదం కొత్తగా వచ్చిందేమీ కాదని, భారతీయ మూలాల్లోనే అది ఉందని ఈ సందర్భంగా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి గుర్తు చేశారు. దేశంలో నేటికీ అనేక సమస్యలున్నాయని, వాటి పరిష్కారం దిశగా విజ్ఞానాన్ని వినయోగిస్తే భారత్ కు ప్రపంచంలో ఎదురేలేదని స్పష్టం చేశారు. విద్యా సామాజిక బాధ్యతగా ప్రతి అధ్యాపకుడు, పరిశోధకుడు సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
కాలం విసిరే సవాళ్లు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారం అభిప్రాయపడ్డారు. కొవిడ్ విద్యావ్యవస్థలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. సాంకేతికత భవిష్యత్తు విద్యావిధానాన్ని సమూలంగా మార్చేస్తుందని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటం ద్వారా ప్రతి అధ్యాపకుడు ఇందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగావకాశాల కోసం మాత్రమే పరిమితం కాదు అని వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ అభిప్రాయపడ్డారు. వ్యక్తి సమగ్ర వికాసానికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహించడానికి, భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకెఎస్) అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఓయూ సిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు. తెలంగాణ ఉన్నత విద్యారంగాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఉన్నత విద్యామండలితో కలిసి పనిచేస్తామని ప్రొఫెసర్ కుమార్ స్పష్టం చేశారు.
బలమైన విద్యావ్యవస్థను నిర్మించడంలో నైపుణ్యం కలిగిన విద్యావేత్తల ఆవశ్యకతను అఖిల భారతీయ రాష్ట్రీయ షైక్షిక్ మహాసంఘ్ (ABRSM) ప్రధాన కార్యదర్శి, గుంతా లక్ష్మణ్ జీ నొక్కిచెప్పారు. IKSలో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు.
ఐకేఎస్ తాత్విక, శాస్త్రీయ ఔచిత్యం పై తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రాణి సదాశివ మూర్తి కీలకోపన్యాసం చేశారు. ఆధునిక విద్యావ్యవస్థలో భారతీయతను చేర్చటం, భారత దేశ విద్యావారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని విద్యాభారతి శిక్షా సంస్థాన్(VBUSS) ఉపాధ్యక్షుడు మురళీ మనోహర్ వివరించారు. భారతీయ జ్ఞాన వ్యవస్థ, ఐకేఎస్ లో పొందుపరిచిన విజ్ఞానాన్ని పునరుజ్జీవింపజేయాలని NCTE-SRC మాజీ సభ్యులు ఆచార్య గంటా రమేష్ కోరారు. మూడురోజుల పాటు జరిగే ఈ జాతీయ సదస్సు డైరెక్టర్లు ఆచార్య రవీంద్రనాథ్ కె మూర్తి, ఆచార్య టి. మృణాళిని అథితులకు స్వాగతం పలికారు.
* * *
Leave A Comment